'మనదేశం' హీరోయిన్‌గా సి. కృష్ణవేణి పాపులర్ అయ్యారు. ఆ సినిమా ద్వారానే ఎన్టీఆర్ నటునిగా పరిచయమయ్యారనే విషయం మనకు తెలుసు. ఆ మూవీలో పోలీసుగా ఆయన ఒక చిన్న వేషం వేశారు. 'సతీ అనసూయ' సినిమాని సి. పుల్లయ్య డైరెక్ట్ చేశారు. అందులో సి. కృష్ణవేణి హీరోయిన్. అప్పటికి ఆమె వయసు 12 యేళ్లు. ఆ మూవీలో నటించే అవకాశం ఆమెకు రేలంగి వెంకట్రామయ్య వల్ల వచ్చింది. ఆయన ప్రొడక్షన్‌లో చిన్నతనంలోనే కృష్ణవేణి నాటకాలు ఆడారు. 'రామదాసు' అనే నాటికలో కమల పాత్ర వేశారు. రాజమండ్రిలో ఆ ప్రదర్శనను సి. పుల్లయ్య చూశారు. రేలంగి ద్వారా ఆమెను మద్రాసు పిలిపించుకొని అనసూయ వేషం ఇచ్చారు. మద్రాసు వెళ్లాక ఆమె స్టూడియోలోనే ఉన్నారు.
13వ యేటనే ఆమె హీరోయిన్ అయ్యారు. మీర్జాపురం రాజావారి జయా ఫిలిమ్స్ నిర్మించిన 'భోజ కాళిదాసు' మూవీలో కన్నాంబ హీరోయిన్ అయితే, కృష్ణవేణి సెకండ్ హీరోయిన్. ఆ తర్వాత 'కచదేవయాని'లో దేవయానికిగా నటించారు. ఆమె నట జీవితమంతా జయా ఫిలిమ్స్‌కే పరిమితమైంది.
మీర్జాపురం రాజాతో పెళ్లయ్యాక సినిమాల్లో నటించవద్దని ఆయన చెప్పారు. అయితే సొంత సినిమాల్లో ఆమె నటించారు. 1974లో రాజావారు మరణించారు. ఆయన పోయినా ఆర్థికంగా అమె ఇబ్బంది పడలేదు. కాకపోతే వాళ్ల ఆస్తులు కొన్నింటిని అప్పటి తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ వాటికి సంబంధించిన కేసులు కోర్టుల్లోనే నలుగుతున్నాయి. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి ఇచ్చిన భూమి రాజావారిదే. అందుకే దానికి ఆయన పేరు పెట్టారు.